Saturday, 19 April 2014

ప్రియమైన అమ్మకు

నాకొక చిట్టి మనసుంది
ఆ మనసుకు మంచి తోడుంది

ఆ తోడే నా బొమ్మ గీసింది
నా భవితకు బాట వేసింది

మంచి మాటలు చెప్పింది
మమతను నాలో పెంచింది

చందమామను చూపింది
గోరుముద్దలు పెట్టింది

నడకను నాకు నేర్పింది
నడతను గూర్చి చెప్పింది

స్నేహానికి అర్థం తెలిపింది
నా ప్రియ నేస్తం అయ్యింది

నా మనసులో మాటను గుర్తించి
నా కోర్కెను తానే తీర్చింది

నా ఆవేదన గుర్తించింది
మంచి ఆలోచనని ఇచ్చింది

సర్వం నాకు ఇచ్చింది
అమ్మకు అర్థం చెప్పింది

ప్రియమైన నాన్నకు

ఇంకెన్నేళ్ళు నేనీచెంతుంట
ఉన్నన్నాళ్ళు నేనీవెంటుంట

ఎన్నో ఆశలతో పయనిస్తున్నా
ఏవో ఊహలతో జీవిస్తున్నా

నా మనసు కోరేది నీ మమతను
నా తనువు కోరేది నీ చనువును

నా చేయి కోరేది నీ చెలిమిని
నా నీడ వెతికేది నీ జాడని

నా మౌనం వేచేది నీ మాటకు
నా పెదవి పలికేది నీ ప్రశ్నకు

నా కనులు వేచేది నీ సైగకు
నా గుండె కోరేది నీ గెలుపును

నేను ఎక్కే ప్రతి మెట్టు నీ శ్రమకు గుర్తింపు
నేను పొందే ప్రతి విజయం నీ శ్రమకు ఓదార్పు

నువ్వు చిందించే స్వేదం నడిపింది నను దూరం
నేను చేరాలి గమ్యం కాకూడదు నీకు భారం

నా కోరిక తీరాలి నీకు అండగా ఉండాలి
కష్టాలు తొలగాలి సంతోషం మిగలాలి

సిరిసంపదలు రావాలి సుఖంగా జీవించాలి
లక్ష్య సాధనలో మన శ్రమ ఫలించాలి

ప్రియ నేస్తం

నాకొక నేస్తం కావాలి

హృదయానికి హత్తుకుపోవాలి

తన గుండెలో నేను కొలువుండాలి

కంటికి రెప్పలా నన్ను చూసుకోవాలి

తన కంటి నలుసు 
నన్ను బాధించాలి

నా బాధను తను ఓదార్చాలి

స్వార్ధమన్నది తొలగిపోవాలి ఒకరికిఒకరై జీవించాలి

అమ్మలా ఆప్యాయతనివ్వాలి నాన్నలా నన్ను మందలించాలి

తోబుట్టువై నాకు తోడుండాలి చిరకాలం నా చెంతుండాలి

కలకాలం మేము కలిసుండాలి నాకలాంటి నేస్తం కావాలి

ప్రేమ పూజారి

సున్నిత సుకుమార కోమలాంగి
చూడవా నా వైపు సుందరాంగి

ఇప్పటికైనా కరునించవా 
నీ ప్రేమ నా పై కురిపించవా

నీ కనుపాపలో కాంతి తారల్ని మరిపించు
నీ చిరునవ్వులో సిరులు నన్నెంతో మురిపించు

లేలేత చెక్కిళ్ళ రోజాపువ్వా
వయ్యారి నడకల అప్సరస నువ్వా

ముద్దొచ్చు నీ మోము తలపించు చంద్రబింబము
ముచ్చటగోల్పు నీ చిలుకపలుకులు మరువలేని తీపి గుర్తులు

మంచి మనసుతో మమతల్ని పంచేవు
నిండు హృదయంతో దానాలు చేసేవు

నిన్ను చూసి ముగ్ధున్ని అయ్యాను
నీ ప్రేమకు దాసుణ్ణి అయ్యాను

ఈ జన్మకు నా ప్రాణము
నీ ప్రేమకే అంకితము

స్నేహం

మనసున్న ప్రతి మనిషికి మధురమైన తోడు స్నేహం

లాభనష్టాల ఒడిదుడుకులను కష్టసుఖాల కలయికలను

కలసి పంచుకునే తోడు స్నేహం

మరువలేని మరపురాని మధురమైన తోడు స్నేహం

మనసులను కలిపేది మమతలను పంచేది స్నేహం

నిరాశ చెందిన హృదయానికి ఆశాభావాన్ని పెంచునది స్నేహం

మోడుబారిన జీవితాన్ని చిగురింపచేయునది స్నేహం

కమ్మని కలయిక స్నేహం ఆ స్నేహం మధురం

స్నేహం విలువ తెలియని జీవితం వ్యర్ధం

వీధి బాల్యం

పాలు తాగే పసిపిల్లలు నీటికోసం అలమటించెదరు
అమ్మ ఒడిలో ఒదిగే వేళ చెత్తకుండిలో శయనించెదరు

లోకమెరుగని పసికూనలు అమ్మ ప్రేమకై పరితపించెదరు
నీడలేని చిట్టికూనలు చెట్లక్రిందే విశ్రమించెదరు

ఆటపాటలతో కేరింతలు కొట్టువేళ ఆకలితో పోరాటం చేసెదరు
ఆకలి మంటలు తీరేటందుకు జీవనపోరాటం సాగించెదరు

బడికి పోవలసిన బుడతలు బ్రతుకు భారాన్ని మోసెదరు
చిత్తుకాగితాల వేటలో రేయింబవళ్ళు శ్రమించెదరు

ఎండకు ఎండి, వానకు తడిచి, గాలికి తిరిగి, ధూళిలో పెరిగెదరు
పట్టించుకొనుటకు 'నా' అన్నవారు ఉండీ, లేని అనాధలు వారు

చిరిగిన దుస్తులతో ఆకలిదప్పులతో పయనించెదరు 
పొట్ట కూటికై చిల్లర దొంగలగా మారెదరు

ఇది ఆ పిల్లల పాపమా? వదిలేసిన పెద్దల నేరమా?
ఏదీ పట్టించుకోని మన ప్రభుత్వ వైఫల్యమా ?????

రాజకీయం

ప్రజలను పాలించేది ప్రభుత్వం
ప్రభుత్వాన్ని పీడించేది రాజకీయం

ఐదేళ్ళకోసారి మన ముందుకొస్తారు
మీ రాత మారుస్తామంటూ ఉపన్యాసాలిస్తారు

దండాలు పెట్టి ఓట్లు దండుతారు
నోట్లు పోసి సీట్లు కొంటారు

పదవి వచ్చాక ప్రజల్ని మరుస్తారు
ధనార్జనలో మునిగి తేలుతుంటారు

విధి నిర్వహణకు స్వస్తి చెబుతారు
విదేశాలలో విహారయాత్ర సాగిస్తారు

న్యాయానికి గంతలు కడతారు
అన్యాయానికి జేజేలు పలుకుతారు

ప్రతిభను మెచ్చి పథకాలు ఇస్తారు
కాసులిచ్చిన వారికే ఉద్యోగాలిస్తారు

నిరుపేదలకు నిలువ నీడను కల్పించలేరు
తమ వారసులకు ఆస్తులను సమకూరుస్తారు

మతం పేరుతో పార్టీలు పెడతారు
ప్రజలలో వివాదాలు రేపుతారు

ప్రభుత్వ రంగంలో సిబ్బందికి లోటు
నీతికి నిలబడిన వారిపై వేస్తారు వేటు

స్వార్ధపరుల సమూహం ఈ రాజకీయం
ఎటు పోతుందో తెలియదు మన సమాజం